క‌రోనా వైరస్‌లో కొత్త రకాలు వస్తున్నాయి: బైడెన్‌

21-02-2021 Sun 10:59
  • క‌రోనా వ్యాక్సిన్ల ఉత్పాదకత ఎలా ఉంటుందో మ‌న‌కు ఇంకా తెలియదు
  • ఈ ఏడాది కరోనా పూర్తిగా అంతరిస్తుందని చెప్పలేను
  • కాక‌పోతే అప్ప‌టిలోగా పరిస్థితులు మారతాయి
new virus cases increases says biden

క‌రోనా వైరస్‌లో కొత్త రకాలు వస్తున్నాయని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ అన్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... క‌రోనా వ్యాక్సిన్ల ఉత్పాదకత ఎలా ఉంటుందో మ‌న‌కు ఇంకా తెలియదని తెలిపారు. ఈ ఏడాది చివరికి కరోనా పూర్తిగా అంతరిస్తుందని తాను మాట ఇవ్వలేనని చెప్పారు.

కాక‌పోతే అప్ప‌టిలోగా పరిస్థితులు మారతాయని తెలిపారు. వ్యాక్సిన్లను తీసుకురావడంతో పాటు వాటిని ప్రజలకు అందించడం వంటి ప్ర‌క్రియ అంత తేలిక‌ కాదని చెప్పారు. ప్రస్తుతమున్న‌ వాతావరణం కూడా వాటి పంపిణీకి అడ్డుగా మారుతోంద‌ని తెలిపారు.

తాము జులై 29 నాటికి 60 కోట్ల డోసుల క‌రోనా వ్యాక్సిన్లు కావాలని ఆర్డరు చేశామ‌ని వివ‌రించారు. అవి వచ్చాక పరిస్థితుల్లో  మార్పు వ‌స్తుంద‌ని చెప్పారు. ఎప్ప‌టికి ఈ కరోనా సంక్షోభం ముగిసిపోతుందో తాను చెప్పలేనని తెలిపారు.

ప్రపంచమంతా కరోనా నుంచి విముక్తి పొందాల‌ని అన్నారు.   అమెరికా అంతటికీ వ్యాక్సిన్లు ఇవ్వాలనే ప్రణాళిక నాలుగు వారాల క్రితం వరకు లేదని ఆయ‌న చెప్పుకొచ్చారు. మాజీ అధ్యక్షుడు  ట్రంప్ తగినన్ని వ్యాక్సిన్లను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆయ‌న తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చాక ప‌రిస్థితులు మారాయ‌ని చెప్పారు. రోజుకు 17 లక్షల మందికి టీకాలు వేయిస్తున్నామ‌ని చెప్పారు. మ‌రోవైపు, పారిస్‌ ఒప్పందంలోకి అమెరికా మళ్లీ చేరింది. దీనిపై ఐక్యరాజ్య స‌మితి స్పందిస్తూ అమెరికా తీసుకున్న చ‌ర్య‌ను ప్ర‌శంసించింది.  

ఇది ప్ర‌పంచానికి మంచిద‌ని తెలిపింది. అమెరికా వంటి కీలక భాగస్వామి లేకపోవడం గత నాలుగేళ్లలో లోటుగా ఉండేదని చెప్పింది. ప్ర‌పంచ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కోసం పారిస్‌లో చేసుకున్న ఒప్పందాన్ని ముందుకు  తీసుకు వెళ్లాల్సి ఉంద‌ని తెలిపింది.  గత ఆరేళ్లలో అన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయాయని తెలిపింది.  ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలకు పైగా పెరిగిపోతాయని చెప్పింది.