ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు... చంపేసి పారిపోతుంటే ప్రమాదం!

21-02-2021 Sun 09:20
  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • ఇల్లరికం వచ్చిన డాక్టర్ అల్లుడు గోపాల్
  • పిల్లలు లేకపోవడంతో విభేదాలు
  • విడాకులు కోరడంతో హత్య
Husbend Murders Wife and Escape Meet Accident

ఎంతగానో ప్రేమించి, పెళ్లాడిన భార్యతో విభేదాలు వచ్చి, ఆపై ఆమె విడాకులు కోరగా, ఆమెను దారుణంగా హత్య చేసి పారిపోతూ, ప్రమాదానికి గురై, ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడో వ్యక్తి. అతను ఓ వైద్యుడు కావడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న గోపాల్ కుమార్ (40), మరో ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్న తన బంధువైన కీర్తనను ప్రేమించి, మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

వివాహం తరువాత చెంగల్పట్టు సమీపంలోని మధురాంతకంలో కీర్తన ఇంట్లోనే ఇల్లరికం అల్లుడిగా వచ్చిన గోపాల్ కుమార్, అక్కడే ఉంటున్నారు. వీరిద్దరికీ ఇంతవరకూ పిల్లలు లేరు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా బేదాభిప్రాయాలు రావడంతో, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగ్రహాన్ని పెంచుకున్న గోపాల్, ఇంట్లోని కత్తిని తీసుకుని తొలుత మామపై, ఆపై కీర్తనపై దాడికి పాల్పడ్డాడు. కీర్తన గొంతు కోసి, బయటకు లాక్కొచ్చి, రోడ్డుపై పడేసి, కారుతో తొక్కించి ఆమెను చంపేశాడు.

ఆపై అక్కడి నుంచి గోపాల్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని, కీర్తన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన మామ మురహరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోపాల్ ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయగా, జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ, అదుపుతప్పిన గోపాల్ కారు ప్రమాదానికి గురైంది. టోల్ గేటు వద్ద కారు బోల్తా పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గోపాల్ ను చెంగల్పట్టు ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.