Minority: బీజేపీ నేతగా ఎదిగిన బంగ్లాదేశ్ అక్రమ వలసదారు... అరెస్ట్ చేసిన పోలీసులు!

  • తప్పుడు పత్రాలతో నేతగా ఎదిగిన రూబెల్ షక్
  • ప్రస్తుతం నార్త్ ముంబై మునారిటీ చీఫ్ గా బాధ్యతలు
  • ఎంపీ గోపాల్ శెట్టికి సన్నిహితుడిగా పేరు
Police Arrested BJP Minority Leader as he is from Bangladesi

బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వలస వచ్చి, ముంబైకి చేరి, బీజేపీకి చెందిన స్థానిక నేతగా ఎదిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రూబెల్ షేక్ అనే వ్యక్తి తప్పుడు ధ్రువ పత్రాలతో ముంబైలో నివాసం ఏర్పరచుకోగా, పోలీసులు ఈ నెల ప్రారంభంలో అరెస్ట్ చేశారు. స్థానిక బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టికి ఇతను అనుచరుడని, నార్త్ ముంబై మైనారిటీ సెల్ చీఫ్ గా పనిచేస్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీతో అతను కలిసున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంలో స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్, "ఈ అమిత్ షా, తన పార్టీ కార్యకర్తల కోసం పౌరసత్వ బిల్లులూ సవరణలు చేసినట్టున్నారు" అని ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారని, వారిలో అత్యధికులు ఎటువంటి గుర్తింపు లేకుండా అక్రమంగా ఉంటున్న వారేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

"ఉత్తర ముంబై బీజేపీ మైనారిటీ సెల్ చీఫ్ ఓ బంగ్లాదేశీ. మేము బీజేపీని ఒకటే అడగాలని అనుకుంటున్నాం. ఇదేనా 'సంఘ్ జీహాద్' అంటే? సీఏఏ విషయంలో బీజేపీకి ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నాయా? ఈ దేశంలో ప్రజలందరికీ ఓ చట్టం, బీజేపీకి మరో చట్టం ఉన్నాయా?" అంటూ సావంత్ నిప్పులు చెరిగారు.

ఇదే సమయంలో బీజేపీ ఎంపీ శెట్టి, ఈ విషయాన్ని చాలా చిన్నదిగా కొట్టిపారేశారు. మైనారిటీ సెల్ తరఫున అతన్ని ఎవరో తనకు పరిచయం చేశారని, ఆ సమయంలో దిగిన చిత్రాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. తన వద్దకు ఎంతో మంది వచ్చి కలుస్తుంటారని అన్నారు. ఎవరైనా తప్పు చేసుంటే చట్టం తన పని తాను చేసుకు పోతుందని, తనకు ఏ విషయమైనా తెలిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తానని అన్నారు.

బంగ్లాదేశ్ నుంచి వచ్చి, చట్ట వ్యతిరేకంగా నివశిస్తున్న ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాము మరింత స్పష్టమైన ప్రకటన కోరుతున్నామని డిమాండ్ చేశారు.

More Telugu News