ఏం సాక్ష్యముందో చూపండి: దిశా రవి కేసులో పోలీసులను ఆదేశించిన న్యాయమూర్తి!

21-02-2021 Sun 07:07
  • రైతులను ఆందోళనల దిశగా పురికొల్పారు
  • ఆమేమీ అమాయకురాలు కాదన్న ప్రాసిక్యూషన్
  • జనవరి 26 హింసతో సంబంధాలపై సాక్ష్యం కోరిన న్యాయమూర్తి
Judge Asked Exact Evidence Against Disha Ravi

రైతులను ఆందోళనల దిశగా పురికొల్పారని, ఖలిస్థాన్ వేర్పాటువాదులతో కలసి టూల్ కిట్ ను తయారు చేయడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన దిశా రవి బెయిల్ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో భారత పరువును తీసే ప్రయత్నం ఆమె చేశారని, రైతుల ఆందోళనలను అడ్డుపెట్టుకుని దేశంలో అశాంతి రేపాలని చూశారని కూడా పోలీసులు ఆరోపించగా, తనకు సాక్ష్యాలను చూపాలని న్యాయమూర్తి కోరారు.

అంతకుముందు దిశా రవికి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించిన ప్రాసిక్యూషన్, టూల్ కిట్ తయారీ వెనకున్న ఆమె అమాయకురాలేమీ కాదని, కావాలనే ఇలా చేశారని అన్నారు. కేసును విచారించిన న్యాయమూర్తి ధర్మేందర్ రానా, "అసలు టూల్ కిట్ అంటే ఏంటి? దానంతట అదే దోషపూరితం అవుతుందా? అసలు ఈ మహిళకు, జనవరి 26 నాటి హింసాత్మక ఘటనలకు సంబంధం ఉందని సరైన సాక్ష్యాలు మీ దగ్గర ఏమున్నాయి? ఉంటే వాటిని చూపించండి" అని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు.