Chandrababu: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దు... ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీలో రాజకీయ చైతన్యం
  • పాదయాత్ర చేపట్టిన విజయసాయి
  • ప్రధానికి లేఖ ద్వారా తమ గళం వినిపించిన చంద్రబాబు
  • స్టీల్ ప్లాంట్ దేశానికే గర్వకారణమని వెల్లడి
  • సొంతంగా గనులు లేకపోవడం నష్టాల పాల్జేసిందని వివరణ
Chandrabu writes PM Modi to stop Visakha Steel Plant privatisation

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో రాజకీయ ఆగ్రహజ్వాలలు రగిలింపజేస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ పరిధిలో పాదయాత్ర చేయగా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

 విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకే కాదు దేశానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ పరిశ్రమను ప్రారంభించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు జీవనాడి అని పేర్కొన్నారు.

ఈ పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమంలో అనేకమంది అసువులుబాసారని వివరించారు. 68 గ్రామాలకు చెందిన 16 వేల కుటుంబాలు 26,000 ఎకరాల భూమిని ఇచ్చాయని చంద్రబాబు తెలిపారు. అయితే 8 వేల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు.

గతంలో స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వచ్చాయని బీఐఎఫ్ఆర్ సిఫారసు చేశారని, అప్పట్లో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం రూ.1,033 కోట్ల ప్యాకేజి ఇచ్చిందని వెల్లడించారు. పునర్నిర్మాణ ప్యాకేజితో ప్లాంట్ లాభాల బాట పట్టిందని వివరించారు. సొంతంగా గనులు లేకపోవడం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సొంత గనులు ఏర్పాటు చేయాలని సూచించారు.

More Telugu News