Putta Madhu: నేను ఎక్కడికీ పారిపోలేదు.. హత్య జరిగినప్పటి నుంచి మంథనిలోనే ఉన్నాను: పుట్ట మధు

  • పోలీసుల కన్నా మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది
  • దర్యాప్తును మీడియా సంస్థలే చేస్తున్నట్టుంది
  • నన్ను జైలుకి పంపించేందుకు మీడియా సంస్థలు తాపత్రయపడుతున్నాయి
I am in Manthani only says Putta Madhu

హైకోర్టు లాయర్ వామనరావు దంపుతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ పుట్ట మధు పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పుట్ట మధు మంథనిలో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో పోలీసుల కన్నా మీడియానే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. మీడియా చేస్తున్న అసత్య ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారని మండిపడ్డారు. పోలీసులు చేయాల్సిన దర్యాప్తును మీడియా సంస్థలే చేస్తున్నట్టుందని విమర్శించారు. తాను మంథనిలో లేనని, కనపడకుండా వెళ్లిపోయానని కొన్ని పేపర్లు, టీడీపీ ప్రచారం చేశాయని... తాను ఎక్కడికీ పారిపోలేదని, మంథనిలోనే ఉన్నానని చెప్పారు.

హత్య జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు తాను మంథనిలోనే ఉన్నానని పుట్ట మధు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని... తాను వారి అపాయింట్ మెంట్లు అడగలేదని చెప్పారు. మీడియా సంస్థలు తనను జైలుకు పంపించేందుకు తాపత్రయ పడుతున్నాయని మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై మీడియా ఎందుకు కక్షకట్టిందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. ఈ హత్య కేసును  పోలీసులు విచారిస్తున్నారని, విచారణ తర్వాత అన్ని ఆధారాలతో హైదరాబాదులో మీడియాతో మాట్లాడతానని తెలిపారు.

More Telugu News