Girl Student: పరీక్షలు తప్పించుకునేందుకు కరోనా డ్రామా ఆడిన విద్యార్థిని

  • అహ్మదాబాద్ లో ఘటన
  • ఒకే స్కూల్లో 13 మందికి కరోనా అంటూ ప్రచారం
  • అలా ప్రచారం చేస్తే పరీక్షలు నిలిపివేస్తారని భావించిన విద్యార్థిని
  • విద్యార్థినిని గుర్తించిన యాజమాన్యం
  • ఎలాంటి చర్య తీసుకున్నా తమకు అభ్యంతరంలేదన్న తల్లిదండ్రులు
  • క్షమించి వదిలేసిన యాజమాన్యం
Student spreads fake news to avoid exams in school

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వారం కిందట ఓ స్కూల్లో 13 మంది కరోనా పాజిటివ్ అంటూ వార్తలొచ్చాయి. కరోనా కేసులు తగ్గుతున్న వేళ ఒకే స్కూల్లో అంతమందికి కరోనా వచ్చిందన్న ప్రచారం కలకలం రేపింది. అధికారులు దీనిపై తీవ్రంగా స్పందించారు. అయితే ఇదంతా ఓ విద్యార్థిని ఆడిన డ్రామా ఆని ఆ తర్వాత వెల్లడైంది.

అసలేం జరిగిందంటే... అహ్మదాబాద్ లోని ఉద్గామ్ స్కూల్లో ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆ పరీక్షలకు సరిగా సన్నద్ధం కాలేదు. సరిగా చదవకుండా పరీక్షలు రాస్తే మార్కులు తక్కువ వస్తాయని భావించిన ఆ విద్యార్థిని ఏకంగా పరీక్షలనే నిలిపివేసేలా చేయాలని పథక రచన చేసింది. ఉద్గామ్ స్కూల్లో 13 మంది విద్యార్థులకు కరోనా అంటూ ఓ ఫేక్ న్యూస్ సృష్టించి స్కూలు విద్యార్థుల సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేసింది. దాంతో అధికారులు స్పందించి స్కూల్లో పరీక్షలు ఆపేస్తారన్నది ఆ అమ్మాయి ఆలోచన.

దీనిపై విచారణ జరిపిన స్కూలు యాజమాన్యం ఈ ప్రచారం వెనుక ఉన్న విద్యార్థినిని గుర్తించింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం వివరించగా, తమ కుమార్తెపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు సమ్మతమే అని చెప్పారు. అయితే, విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఆ అమ్మాయిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకోవడంలేదని ఉద్గామ్ స్కూల్ ట్రస్టీ మన్నన్ చోక్సీ వెల్లడించారు. తాను చేసిన తప్పుకు ఆ విద్యార్థిని పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని వివరించారు.

More Telugu News