రజనీకాంత్ ను కలిసిన కమలహాసన్

20-02-2021 Sat 17:08
  • ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమల్
  • రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించిన రజనీ
  • రజనీ ప్రకటన తర్వాత తొలిసారి కలిసిన కమల్
Kamal Haasan Meets Rajinikanth

తన మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ను సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కలిశారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని రజనీకాంత్ ప్రకటించిన తర్వాత ఆయనను కమల్ కలవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కమల్ పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

రజనీకాంత్ ను కమల్ కలవడం తమిళనాట సంచలనంగా మారింది. రజనీ మద్దతు కోరేందుకు కలిశారా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కమల్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని వారు తెలిపారు. 2018లో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని కమల్ ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి తన మిత్రుడు రజనీ మద్దతు కోరుతానని ఇటీవల కమల్ ప్రకటించారు.