ఇటు హీరోయిన్ .. అటు విలన్.. రెండు పాత్రల్లో ఐశ్వర్య రాయ్!

20-02-2021 Sat 16:32
  • మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్'
  • గత కొన్నాళ్లుగా హైదరాబాదులో షూటింగ్
  • మందాకినీదేవి, నందిని పాత్రలలో ఐశ్వర్య
  • రెండు భాగాలుగా విడుదల అయ్యే సినిమా  
Aishvarya Rai plays two differant roles in Maniratnam movie

బాలీవుడ్ అందాలతార ఐశ్వర్య రాయ్ ఇప్పుడు ఓ ప్రయోగం చేస్తోంది. ఒకే సినిమాలో రెండు విభిన్న తరహా పాత్రలు పోషిస్తోంది. ఇటు కథానాయికగా.. అటు విలన్ గా రెండు భిన్న పాత్రలను చేస్తోంది. ఈ ముచ్చట ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో చోటుచేసుకుంటోంది.

కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రసిద్ధ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం తన డ్రీమ్ ప్రాజక్టుగా ఈ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మందాకినీ దేవి పాత్రలోనూ, నందిని పాత్రలోనూ ఐశ్వర్య నటిస్తోంది. వీటిలో ఒక పాత్ర విలనిజంతో  సాగుతుందని తెలుస్తోంది. విలనీ పాత్ర పోషణలో ఐశ్వర్య ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటోందట. ఈ రెండు పాత్రలలోను గెటప్పుల పరంగా ఆమె సరికొత్తగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ రెండూ ఆమె కెరీర్లో నిలిచిపోయే పాత్రలవుతాయని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా హైదరాబాదులో జరుగుతోంది. ఐశ్వర్యరాయ్ కాకుండా ఇంకా విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాజేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారట.