దుర్గగుడిలో ఏసీబీ సోదాలపై మంత్రి వెల్లంపల్లి స్పందన... ఆపై కేశినేని నాని విమర్శలు

20-02-2021 Sat 16:19
  • మూడ్రోజులుగా దుర్గగుడిలో ఏసీబీ దాడులు
  • అవినీతి జరగకుండా ఉండేందుకేనన్న వెల్లంపల్లి
  • అవినీతిపరులను వదిలిపెట్టేదిలేదని ఉద్ఘాటన
  • వెల్లంపల్లివి పనికిమాలిన మాటలంటూ కేశినేని నాని వ్యాఖ్యలు
  •  దేవుడి హుండీల కంటే వెల్లంపల్లి హుండీలే నిండాయని వెల్లడి
War of Words between Vellampalli and Kesineni Nani

బెజవాడ కనకదుర్గ ఆలయంలో గత మూడ్రోజులుగా ఏసీబీ దాడులు జరుగుతుండడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. సాధారణంగా వచ్చే ఫిర్యాదులపై ఏసీబీ దాడులు చేస్తోందని, ఎక్కడా అవినీతి జరగకుండా ఉండేందుకే ఈ దాడులు అని వెల్లడించారు. ఎక్కడ తప్పు జరిగినా, ఆ తప్పులకు ఎవరు కారకులైనా వదిలిపెట్టేది లేదన్నారు. అవినీతి నిర్మూలన దిశగా సీఎం జగన్ ఏసీబీకి స్వేచ్ఛ ఇచ్చారని, దీంట్లో భాగంగానే అవినీతిపరుల వేట సాగుతోందని తెలిపారు. గతంలో ద్వారకా తిరుమలలోనూ ఏసీబీ సోదాలు జరిగాయని మంత్రి వెల్లంపల్లి వివరించారు.

కాగా, మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. వెల్లంపల్లి పనికిమాలిన మాటలు చెబుతున్నారని విమర్శించారు. దేవుడి హుండీల కంటే వెల్లంపల్లి హుండీలే నిండాయని వ్యాఖ్యానించారు. అవినీతి జరిగిందని చెప్పడం కాదు... అధికారం ఉంది కాబట్టి దమ్ముంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.