కుప్పం నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. నేతలకు అధినేత చురకలు!

20-02-2021 Sat 15:30
  • రౌడీయిజం, డబ్బు పంపిణీ వల్ల వైసీపీ గెలిచింది
  • ఎవరేం చేస్తార్లే అని కౌంటింగ్ ను వదిలేశారు
  • ఫలితాలను అధికారులు తారుమారు చేశారు
Chandrabbu teleconference with Kuppam leaders

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రౌడీయిజం, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, అధికారుల సహకారం కారణంగానే వైసీపీ విజయం సాధించిందని అన్నారు.

టీడీపీ నేతలు కూడా పోలింగ్ బూత్ లను, కౌంటింగ్ ను విడిచిపెట్టి తిరిగారని చురకలు అంటించారు. ఎవరేం చేస్తార్లే అని కౌంటింగ్ ను వదిలేశారని... ఈలోపల ఫలితాలను అధికారులు తారుమారు చేశారని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని తాను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. మనం ఎంత బాగా పని చేసినా అధికార పార్టీ అరాచకాల వల్ల ఓటమిపాలయ్యామని చెప్పారు.

మనలోని బలహీనతలు, అనైక్యతను అవతలివారు అడ్వాంటేజ్ గా తీసుకుంటారని తెలిపారు. విలువలకు ప్రాధాన్యతనిచ్చే కుప్పం వ్యక్తిత్వాన్ని ఈ ఎన్నికల ఫలితాలు దెబ్బతీశాయని అన్నారు. త్వరలోనే మబ్బులు తొలగిపోతాయని... మన ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తాము బాగా పని చేశామని... అయినా వైసీపీ అరాచకాలు, డబ్బు పంపిణీ వల్ల ఓడిపోయామని చెప్పారు.