హైదరాబాద్ ఆటగాళ్లను తీసుకోకపోతే మ్యాచ్ లను అడ్డుకుంటాం: దానం నాగేందర్ వార్నింగ్

20-02-2021 Sat 13:52
  • ఇటీవల ఐపీఎల్ మినీ వేలం
  • హైదరాబాదు ఆటగాళ్లను తీసుకోని సన్ రైజర్స్
  • మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన వార్నర్ కెప్టెన్ గా వున్నాడన్న దానం   
  • ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోండని సలహా  
Danam Nagender questions Sunrisers Hyderabad franchise why they not go for local players

ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ ఆటగాళ్లను ఒక్కరినీ కూడా తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ సన్ రైజర్స్ తీరుపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇదే రీతిలో స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన వార్నర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడని, స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాదులో సత్తా ఉన్న క్రికెటర్లకు కొరత లేదని అన్నారు. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాదు ఆటగాళ్లు లేకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా హైదరాబాదు ఆటగాళ్లకు సన్ రైజర్స్ టీమ్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతై ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఇదే తీరు కొనసాగితే హైదరాబాదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని హెచ్చరించారు.