Narendra Modi: దేశం స్వావలంబన సాధించాలంటే.. ప్రైవేటు రంగానికి ప్రభుత్వాలు సహకరించాలి: ముఖ్యమంత్రులతో మోదీ

  • కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలి
  • కరోనాను ఎదుర్కోవడంలో కలిసి విజయం సాధించాం
  • కేంద్ర బడ్జెట్ కు మంచి స్పందన వచ్చింది
Governments Should Back Private Sector To Make India Self Reliant says Modi

కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి సరైన పాలసీని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. నీతిఆయోగ్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.

దేశంలో ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రైవేట్ సెక్టార్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ప్రైవేట్ సెక్టార్ కు మనం సరైన అవకాశాలను అందించాలని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేశాయని, కరోనాను విజయవంతంగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ముందు మనం సగర్వంగా నిలిచామని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయడంలోనే మన దేశాభివృద్ధి ఉందని అన్నారు. పోటీతత్వం అనేది రాష్ట్రాల మధ్యే కాకుండా... అది జిల్లాలకు కూడా విస్తరించాలని చెప్పారు.

గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా సాధించామో... అలాగే ప్రజల సంక్షేమం కోసం ఈజ్ ఆఫ్ లివింగ్ ను సాధించాలని మోదీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కు వచ్చిన స్పందన చాలా గొప్పగా ఉందని... ఈ స్పందన మన దేశం యొక్క మూడ్ ను తెలుపుతోందని అన్నారు.

మరోవైపు ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అమరీందర్ సింగ్ లు గైర్హాజరయ్యారు. నీతిఆయోగ్ కు ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవని... అందువల్ల ఆ సమావేశానికి హాజరుకావడం వల్ల ప్రయోజనం లేదని మమత అన్నారు. దీనికి తోడు రాష్ట్రాల ప్రణాళికలను నీతిఆయోగ్ పట్టించుకోదని విమర్శించారు.

More Telugu News