ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది: 'నీతి ఆయోగ్' సమావేశంలో జ‌గ‌న్

20-02-2021 Sat 13:37
  • నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన జ‌గ‌న్
  • రాష్ట్ర విభ‌జన వ‌ల్ల ఏపీ నష్టపోయింది
  • హోదా ఇస్తామని అప్ప‌ట్లో పార్లమెంట్‌లో ప్రకటన చేశారు 
ap needs special status

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి సమావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్  ప‌లు విష‌యాలను ప్ర‌స్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిని వేగ‌వంతంగా సాధిస్తుంద‌ని చెప్పారు. రాష్ట్ర విభ‌జన వ‌ల్ల ఏపీ నష్టపోయిందని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్ప‌ట్లో పార్లమెంట్‌లో ప్రకటన చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.  పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ఏపీ స‌ర్కారు ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీలను చెల్లించాల్సి వస్తుంద‌ని జ‌గ‌న్ తెలిపారు. అలాగే, రుణాలపై అధిక వడ్డీలతో పాటు విద్యుత్‌ ఖర్చులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి భారంగా మారాయ‌ని చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ఏపీ స‌ర్కారు స‌మ‌ర్థంగా ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించాల‌ని ఆయ‌న చెప్పారు. పంటల స్టోరేజీ, గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌ లో కొత్త సాంకేతిక‌తను ప‌రిచయం చేయాల‌ని తెలిపారు.