నిజమే.. పెళ్లికోసం హిందూ అమ్మాయిల‌కు కొందరు వ‌ల వేస్తున్నారు: మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్

20-02-2021 Sat 12:18
  • కేర‌ళ‌లో ల‌వ్ జిహాద్ కేసులు న‌మోదవుతున్నాయి  
  • హిందూ అమ్మాయిల‌కు ఎలా వ‌ల వేస్తారో నా‌కు తెలుసు
  • ఇక అమ్మాయిలకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి
i know about love jihad

త్వరలో రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని, బీజేపీలో చేర‌తాన‌ని ‘మెట్రో మ్యాన్‌’ శ్రీధరన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డం కోసం పనిచేస్తానని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, పార్టీ కోరితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాన‌ని కూడా చెప్పారు.  

తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ల‌వ్ జిహాద్‌పై కూడా స్పందించ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ‌లో ల‌వ్ జిహాద్ కేసులు న‌మోదవుతున్నాయ‌ని చెప్పారు. కేర‌ళ‌లో హిందూ అమ్మాయిల‌కు వ‌ల వేసి, పెళ్లి చేసుకోవాల‌ని కొందరు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతుండ‌డం నిజ‌మేన‌ని అన్నారు. పెళ్లికోసం హిందూ అమ్మాయిల‌కు ఎలా వ‌ల వేస్తారో త‌న‌కు తెలుస‌ని చెప్పారు. అనంత‌రం అమ్మాయిలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా తెలుస‌ని అన్నారు.

ఇటువంటి చ‌ర్య‌లను తాను వ్య‌తిరేకిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. హిందువుల అమ్మాయిల‌నే కాకుండా ముస్లిం, క్రిస్టియ‌న్ అమ్మాయిల‌ను కూడా పెళ్లి పేరుతో మోసం చేస్తున్నార‌ని తెలిపారు. కాగా, సివిల్ ఇంజినీర్‌గా శ్రీధరన్ దేశంలోని ప్రజా రవాణా వ్య‌వ‌స్థ‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఢిల్లీ, లక్నో, కొచ్చిలో ప్ర‌జ‌ల‌కు మెట్రో రైళ్ల సౌక‌ర్యాల‌ను అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించి, మెట్రో మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు.