రాష్ట్రంలోనే తొలిసారి.. ట్రాన్స్‌జెండర్లతో సమావేశమైన పోలీస్ కమిషనర్ సజ్జనార్

20-02-2021 Sat 09:38
  • సమావేశానికి హాజరైన 150 మంది ట్రాన్స్‌జెండర్లు
  • సునీతా కృష్ణన్ అభ్యర్థన మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డెస్క్
  • వారి సమస్యలు పరిష్కరిస్తామని సీపీ హామీ
cyberabad cp vc sajjanar meeting with transgenders

హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నిన్న సమావేశమయ్యారు. హిజ్రాలతో పోలీస్ కమిషనర్ సమావేశం కావడం తెలంగాణలోనే ఇది తొలిసారి. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డెస్క్ ప్రారంభించారు.

ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతాకృష్ణన్ అభ్యర్థ మేరకు ఈ డెస్క్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సునీత్ కృష్ణన్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యల్లో విద్య, ఉపాధి వంటివి ఉన్నాయని అన్నారు. వారికి అద్దెకు ఇళ్లు దొరకడం లేదని, సన్నిహిత భాగస్వాముల వేధింపులు, వీధుల్లో హింస వంటివి వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఈ డెస్క్ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి తమవైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హామీ ఇచ్చారు.