'ఉప్పెన' బుచ్చిబాబుకి స్టార్ హీరో నుంచి ఆఫర్

19-02-2021 Fri 21:49
  • 'ఉప్పెన' హిట్టవడంతో బుచ్చిబాబుకు ఆఫర్లు 
  • అఖిల్ తో సినిమా కోసం అడిగిన నాగార్జున
  • తాజాగా ఎన్టీఆర్ నుంచి కూడా ఆఫర్  
NTR willing to work with Bucchi babu

ఒక సినిమా హిట్టయితే చాలు.. ఆ చిత్ర దర్శకుడి రాత మారిపోతుంది. పెద్ద పెద్ద హీరోలు కూడా తమతో సినిమా చేయమంటూ ఆఫర్లు ఇస్తారు. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి కూడా అలాగే వుంది. ఆయన రూపొందించిన తొలిచిత్రం 'ఉప్పెన' వినూత్న ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తూ.. బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆయనకు పలు ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పటికే 'ఉప్పెన' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆయనతో రెండు చిత్రాలకు అగ్రిమెంటు కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క, అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో ఓ సినిమా చేసిపెట్టమని భారీ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు.

ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి కూడా బుచ్చిబాబుకు ఆఫర్ వచ్చిందట. వాస్తవానికి ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకి ఇప్పటికే సాన్నిహిత్యం వుంది. గతంలో 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సమయంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకు పరిచయం ఏర్పడిందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.