Germany Woman: పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ హీరో ఆర్యపై జర్మనీ మహిళ ఫిర్యాదు

  • రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసిన జర్మనీ యువతి
  • చెన్నైలోని హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తున్న యువతి
  • అర్మాన్, హుస్సేనీ అనే వ్యక్తుల ద్వారా ఆర్య పరిచయం
  • ఆర్థిక ఇబ్బందులలో ఉంటే 80 లక్షలు ఇచ్చానని వెల్లడి
  • ఆర్య తల్లి సమక్షంలోనే ఇచ్చానని వివరణ
  • తన డబ్బు తిరిగి ఇవ్వడంలేదని ఆరోపణ
German woman complaints against hero Arya as he cheated her pretext of marriage

తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న యువ హీరో ఆర్యపై ఓ జర్మనీ యువతి ఏకంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రికే ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని ఆర్య మోసం చేశాడని, తన నుంచి తీసుకున్న రూ.80 లక్షల డబ్బును తిరిగి ఇప్పించాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

సదరు యువతి జర్మనీ నుంచి వచ్చి చెన్నైలోని ఓ వైద్య సేవల సంస్థలో పనిచేస్తోంది. మహ్మద్ అర్మాన్, హుస్సేనీ అనే వ్యక్తుల ద్వారా తనకు ఆర్య పరిచయం అయినట్టు ఆమె వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఆర్య చెప్పడంతో అతడికి నగదు అందించానని, ఈ లావాదేవీలన్నీ ఆర్య తల్లి జమీలా సమక్షంలోనే జరిగాయని జర్మనీ యువతి స్పష్టం చేసింది. తానిచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని, తన విజ్ఞప్తుల పట్ల ఆర్య తల్లి కూడా సరిగా స్పందించలేదని వాపోయింది.

తనను ఇష్టపడుతున్నానని ఆర్య చెప్పాడని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తానే కాకుండా, మరికొందరు అమ్మాయిలను కూడా ఆర్య ఇలాగే నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. ఆర్య మోసానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, తనకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపిన ఫిర్యాదు లేఖలో తెలిపింది. చివరిప్రయత్నంగానే ఈ లేఖ రాసినట్టు వెల్లడించింది.

More Telugu News