వధువు మరో యువకుడితో పారిపోయిందని ఆమె చెల్లెల్ని చేసుకున్న వరుడు... పెళ్లి చెల్లదన్న అధికారులు!

19-02-2021 Fri 20:52
  • ఒడిశాలో ఘటన
  • మాల్పాడ గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 16న వివాహం
  • అదే సమయానికి ప్రియుడితో వెళ్లిపోయిన యువతి
  • ఆమె చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు
  • బాలిక మైనర్ అంటూ అధికారుల రంగప్రవేశం
Odisha authorities stalled a marriage because the is a minor

ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. మాల్పాడ గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి ఈ నెల 16న పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి సమయానికి ఆమె మరో యువకుడితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు నిర్ఘాంతపోయాడు. అతడికి ఊరట కలిగించేలా వధువు చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అధికారులు రంగప్రవేశం చేసి ఆ పెళ్లి చెల్లదని సెలవిచ్చారు. అందుకు కారణం ఆ అమ్మాయి మైనర్ కావడమే.

ప్రస్తుతం ఆ బాలికకు 15 ఏళ్లు కాగా, టెన్త్ క్లాస్ చదువుతోంది. బాల్య వివాహం జరిగిందన్న సమాచారంతో పెళ్లికొడుకు నివాసానికి చేరుకున్న అధికారులు ఆ బాలికను ఆమె సోదరుడికి అప్పగించారు. మైనర్ బాలికకు వివాహం నిబంధనలకు విరుద్ధమని, ఆమె మేజర్ అయ్యేవరకు పెళ్లి మాటే ఎత్తవద్దని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చక్కగా చదువుకోవాలంటూ ఆ అమ్మాయికి సూచించారు. పాపం, ఆ వరుడు తన పెళ్లి ఇలా కావడం పట్ల మరోసారి తీవ్ర నిరాశకు గురయ్యాడు.