Bandi Sanjay: ఏపీలో క్రైస్తవ రాజ్యం.. తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోంది: బండి సంజయ్

  • 2023లో తెలంగాణలో హిందూ రాజ్యం వస్తుంది
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెంపదెబ్బ కొట్టినా పాలకులు మారలేదు
  • ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తాం
There is Christian rule in AP and Muslim rule in Telangana says Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ రాజ్యం నడుస్తోందని... తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. 2023లో తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోందని... బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కేవలం కాషాయ జెండా మాత్రమే ఎగురుతుందని అన్నారు.

హైదరాబాదులోని బోరబండలో ఈరోజు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

గ్రేటర్ ఎన్నికల్లో హిందూ ఓటర్లు చెంప దెబ్బ కొట్టినా పాలకులకు బుద్ధి రాలేదని సంజయ్ మండిపడ్డారు. హిందూ దేవుళ్లను అవమానించిన ఎంఐఎంకు టీఆర్ఎస్ పార్టీ కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. కేవలం ఒక మతం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ ఉత్సవాలను జరపడం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోరబండలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు సమస్యే కాదని అన్నారు. మత మార్పిడులపై ధర్మ యుద్ధం చేస్తామని చెప్పారు. 80 శాతం మంది హిందువులు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారబోతున్నారని అన్నారు.

More Telugu News