రూ.15 కోట్లంటే న్యూజిలాండ్ డాలర్లలో ఎంత మొత్తమో తెలియదు: ఐపీఎల్ చాన్సు కొట్టేసిన కివీస్ క్రికెటర్ వ్యాఖ్యలు

19-02-2021 Fri 19:57
  • కేల్ జేమీసన్ ను కొనుగోలు చేసిన బెంగళూరు
  • రూ.15 కోట్లతో జేమీసన్ కు భారీ ధర
  • సంతోషం వ్యక్తం చేసిన కివీస్ ఆల్ రౌండర్
  • ఉత్తమ ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న జేమీసన్
Kyle Jamieson responds after he got huge price in IPL auction

ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ కు అదరిపోయే ధర లభించింది. బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్ లోనూ సత్తా చాటే ఈ 6.8 అడుగుల పొడగరిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.15 కోట్ల ధరతో సొంతం చేసుకుంది. కాగా, తనకు రూ.15 కోట్లు ధర పలకడం పట్ల కైల్ జేమీసన్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.

అయితే, రూ.15 కోట్లు అంటే న్యూజిలాండ్ కరెన్సీలో ఎంత మొత్తమో తనకు తెలియదని చెబుతున్నాడు. పైగా, భారత కరెన్సీని న్యూజిలాండ్ డాలర్లలోకి అనువదించడంపైనా తనకు అవగాహన లేదని తెలిపాడు. భారత్ లో నిన్న సాయంత్రం ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ లో అర్ధరాత్రి కావడంతో జేమీసన్ మాంచి నిద్రలో ఉన్నాడట. ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తేనే జేమీసన్ కు తనకు భారీ ధర పలికిన విషయం తెలిసింది.

కాగా, జేమీసన్ ను బెంగళూరు ఫ్రాంచైజీ ఎగరేసుకుపోవడం వెనుక ఆ జట్టు కోచ్ మైక్ హెస్సన్ పాత్ర ఉంది. హెస్సన్ గతంలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. జేమీసన్ సత్తా ఏంటో తెలిసినవాడు గనుకనే వేలంలో పలు ఫ్రాంచైజీలు పోటీకి వచ్చినా పట్టుబట్టి కొనుగోలు చేసేలా బెంగళూరు ఫ్రాంచైజీని ప్రోత్సహించాడు.

26 ఏళ్ల జేమీసన్ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి  36 వికెట్లు తీశాడు. వాటిలో 5 వికెట్ల ప్రదర్శన నాలుగు సార్లు నమోదు చేశాడు. అదే సమయంలో 56 సగటుతో 226 పరుగులు చేశాడు.