రామ్ తాజా చిత్రంలో నాయికగా కృతిశెట్టి?

19-02-2021 Fri 17:48
  • 'ఉప్పెన'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి 
  • సినిమా హిట్టవ్వడంతో పలు ఆఫర్లు
  • లింగుస్వామి, రామ్ సినిమాలో ఛాన్స్  
Kruti Shetty opposite Ram in his next

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన 'ఉప్పెన' సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించే దిశగా ఇది పయనిస్తోంది. ఈ క్రమంలో ఇందులో నటించిన హీరో వైష్ణవ్ కు, హీరోయిన్ కృతి శెట్టికి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా కృతిశెట్టికి ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడ వెలువడింది. ఊరమాస్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని నిర్మాత శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రంలో కథానాయికగా కృతిశెట్టి ఎంపికైనట్టు తాజా సమాచారం.