కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు

19-02-2021 Fri 17:43
  • 2018లో మమత మేనల్లుడిపై అమిత్ షా వ్యాఖ్యలు
  • కోర్టులో పరువునష్టం దావా వేసిన అభిషేక్ బెనర్జీ
  • వ్యక్తిగతంగా గానీ, లాయర్ ద్వారా గానీ హాజరుకావాలంటూ అమిత్ షాకు సమన్లు
  • ఈ నెల 22న కోర్టు ఎదుట తన వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ
Bengal court issues summons to home minister Amit Shah

బీజేపీ, పశ్చిమ బెంగాల్ అధికారపక్షం టీఎంసీ మధ్య మరింత వాడీవేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2018 నాటి వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తాజాగా సమన్లు జారీ చేసింది. 2018 ఆగస్టు 11న అమిత్ షా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు సమన్లు పంపింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ కోర్టులో హాజరు కావాలని అమిత్ షాకు స్పష్టం చేసింది.

అమిత్ షా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో అభిషేక్ బెనర్జీ విధాన్ నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ విచారణలో అమిత్ షా సమాధానం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.