V Hanumantha Rao: కేసీఆర్ వల్ల తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి వస్తోంది: వీహెచ్

Rayalaseema faction culture is coming to Telangana due to KCR says VH
  • వామనరావు దంపతులను హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
  • కేసీఆర్ పుట్టినరోజున కేకులతో పాటు మనుషులను కూడా కోశారు
  • నయీమ్ కేసు మాదిరే ఈ కేసును కూడా నీరుగార్చే అవకాశం ఉంది
హైకోర్టు న్యాయవాదులైన వామనరావు దంపతుల దారుణ హత్యలు తెలంగాణలో భయాందోళనలను రేకెత్తించాయి. ఇదే సమయంలో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ హత్యలు చేసినట్టు అభియోగాలను ఎదుర్కొంటున్న వారికి టీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు ఉండటంతో... విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

కేసీఆర్ వల్ల తెలంగాణలో కూడా రాయలసీమ తరహా ఫ్యాక్షన్ సంస్కృతి వస్తోందని వీహెచ్ విమర్శించారు. కేసీఆర్ పుట్టినరోజున కేకులతో పాటు మనుషులను కూడా కోశారని దుయ్యబట్టారు. తెలంగాణ అన్నిట్లో నెంబర్ వన్ గా ఉందని కేసీఆర్ చెపుతున్నారని... హత్యల్లో కూడా తొలి స్థానంలో ఉందని అన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వామనరావు దంపతులను హత్య చేశారని చెప్పారు. నడిరోడ్డు మీద ప్రాణాలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని నిలదీశారు. నయీమ్ కేసును నీరుగార్చినట్టే ఈ కేసును కూడా చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
V Hanumantha Rao
Congress
KCR
TRS
Vamanarao

More Telugu News