బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం... ఏపీకి వర్షసూచన

19-02-2021 Fri 17:27
  • రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు
  • తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
  • శ్రీలంక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి
  •  ఉత్తర కర్ణాటక నుంచి  దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు మరో ద్రోణి
  • తెలంగాణలోనూ వర్షపాతం
Rain alert for Andhra Pradesh

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది 1.5 కిమీ నుంచి 3.5 కిమీ ఎత్తులో ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రేపు ఉత్తర కోస్తాతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. అటు శ్రీలంక నుంచి దక్షిణ తమిళనాడు వరకు కిందిస్థాయి తూర్పు గాలుల్లో ద్రోణి ఏర్పడిందని తెలిపారు.

కాగా, హైదరాబాదులో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.