ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇచ్చి ఉంటే జోక్యం చేసుకోవద్దు.... ఎస్ఈసీకి స్పష్టం చేసిన హైకోర్టు

19-02-2021 Fri 15:49
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • ఏకగ్రీవాలపై విచారణ జరిపే అధికారం ఎస్ఈసీకి లేదంటూ పిటిషన్లు
  • ఫాం-10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరపరాదన్న హైకోర్టు
  • ఫాం-10 ఇవ్వని చోట ఫలితాలు నిలిపివేయాలని స్పష్టీకరణ
High Court interim orders on MPTC and ZPTC unanimous results

ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే ఆ ఫలితాలు వెల్లడించవద్దని, నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

కాగా, బలవంతపు ఏకగ్రీవాలపై సమీక్షిస్తామని ఎస్ఈసీ గతంలో చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజా ఉత్తర్వులు ప్రభావం చూపే అవకాశం ఉంది. బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటే, తాము పరిశీలించి మళ్లీ నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తామని ఎస్ఈసీ ఇంతకుముందు పేర్కొన్నారు. ఓ దశలో పూర్తిస్థాయిలో తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఎస్ఈసీ ఆలోచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చినట్టయింది.