ఎవరైనా నా వెనుక రావాల్సిందే... నేను ఒకరి వెనుక రాను: కేశినేని నాని

19-02-2021 Fri 15:08
  • నిన్న విజయవాడలో కేశినేని వర్గం వర్సెస్ బుద్ధా వర్గం!
  • తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేశినేని
  • తనకున్న ప్రజాబలంతో టీడీపీని గెలిపిస్తానని ధీమా
  • పరాజితులే పార్టీకి నష్టం చేస్తున్నారని వ్యాఖ్యలు
  • తాను, తన కుమార్తె పార్టీ కోసమే కష్టపడుతున్నామని వివరణ
Kesineni Nani comments on Vijayawada TDP

బెజవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చిన వేళ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకున్న ప్రజాబలంతో విజయవాడలో టీడీపీని గెలిపిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు వ్యక్తిత్వంతో పాటు సమర్థత ఉన్నవాడినే నమ్ముతారని అన్నారు. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు ఆమడదూరం ఉంచుతారని తెలిపారు.

ఓడిపోయిన సామంతులే ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఎవరైనా తన వెనుక రావాల్సిందే తప్ప తాను ఒకరి వెనుక వెళ్లనని స్పష్టం చేశారు. అయితే అందరూ కలిసి వెళ్లాల్సిన సమయంలో పార్టీని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

విజయవాడలో తాను, తన కుమార్తె మేయర్ పదవి కోసం కష్టపడడం లేదని, తమకు పదవులు అక్కర్లేదని, పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తున్నామని నాని స్పష్టం చేశారు. బెజవాడలో ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇక్కడి పరిణామాలపై చంద్రబాబు వెంటనే స్పందించి వారిని గాడిలో పెడితే పార్టీకే మంచిదని అన్నారు.

నిన్న విజయవాడలో జరిగిన పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గీయులు కేశినేని వర్గాన్ని నిలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని నాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.