నిన్న, మొన్న వచ్చినవారికి మంత్రి పదవులు వచ్చాయి.. నాకు రాలేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

19-02-2021 Fri 12:28
  • మంత్రి పదవి ఇవ్వకపోయినా బాధపడటం లేదు
  • కేసీఆర్ కు నమ్మకంగా పని చేస్తున్నాను
  • పార్టీ శ్రేణులు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు
TRS MLA Muthireddy sensational comments

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి నిన్న, మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని... పార్టీలో సీనియర్ గా ఉన్న తనకు ఇంత వరకు మంత్రి పదవి రాలేదని ఆయన వాపోయారు. అయినా తాను బాధపడటం లేదని... పార్టీ అధినేత కేసీఆర్ కు, పార్టీకి విధేయుడిగా ఉంటూ, పార్టీ ఉన్నతి కోసం నమ్మకంగా పని చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ వల్లే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు.  

పార్టీ కార్యకర్తలకు, నేతలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని ముత్తిరెడ్డి అన్నారు. ఇకనుంచి తనకు పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని... వారు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. జనగామలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి.