నితిన్ 30వ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు

19-02-2021 Fri 12:13
  • దుబాయ్ లో నితిన్ 30వ సినిమా షూటింగ్ 
  • జూన్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటన
  • ఈ నెల 26న వస్తున్న మరో చిత్రం 'చెక్'
  • మార్చ్ 26న విడుదల కానున్న 'రంగ్ దే'  
Nithins Thirtieth film release date announced

హిందీలో హిట్టయిన 'అంధాదున్' చిత్రాన్ని యంగ్ హీరో నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ కథానాయిక తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. నితిన్ నటిస్తున్న 30వ సినిమా ఇది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.

ఇదిలావుంచితే, తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను చిత్ర నిర్మాతలు ఈ రోజు విడుదల చేశారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రాన్ని జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ రిలీజ్ పోస్టర్లో నితిన్ పియానో ప్లే చేస్తున్నట్టు షేడ్ లో కనిపిస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి కలసి నిర్మిస్తున్నారు.

మరోపక్క, నితిన్ ఇప్పటికే మరో రెండు చిత్రాలలో నటించాడు. వీటిలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన 'చెక్' విడుదలకు సిద్ధమైంది. దీనిని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఇక నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'రంగ్ దే' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో వుంది. దీనిని మార్చ్ 26న రిలీజ్ చేస్తారు. ఈ చిత్రాలకు  సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.