ప్రభుత్వం అలాంటి ఆలోచనలో ఉందేమో.. మేం త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం: తికాయత్

19-02-2021 Fri 10:19
  • నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు
  • అవసరమైతే పంటలను తగలబెట్టేందుకు కూడా సిద్ధం
  • పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లోనూ మహాపంచాయత్
Rakesh Tikait says government shouldnt think that protest will end in two months

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ వైఖరిని మరోమారు స్పష్టం చేశారు. చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. పంటల కోతకు తాము ఇంటికి వెళ్తామని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉందని, కానీ తమకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు.  

హర్యానాలో జరిగిన మహాపంచాయత్‌లో ఆయన మాట్లాడుతూ.. చేతికొచ్చే పంటలను సైతం త్యాగం చేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పంటను తగలబెట్టాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు ‘ఘర్ వాపసీ’ ప్రసక్తే లేదని కుండబద్దలుగొట్టారు.

హర్యానాలో మహాపంచాయత్ పూర్తయిన తర్వాత తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తికాయత్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మహాపంచాయత్‌లను నిర్వహిస్తామన్నారు.