అనుమానాస్పద స్థితిలో మరణించిన చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ

19-02-2021 Fri 10:01
  • 2016లో గ్రానైట్ వ్యాపారితో శిరిష్మ వివాహం
  • ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య
  • కారణాలపై దర్యాప్తు
Chalasani Srinivas Sirishma died by Suicide

ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇంటీరియర్ డిజైనర్ అయిన శిరిష్మకు హైదరాబాద్ మణికొండలోని ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహమైంది. గత ఏడాది కాలంగా వీరు గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

బుధవారం రాత్రి ఇంటికొచ్చిన సిద్ధార్థ్ గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించిన శిరిష్మను చూసి విస్తుపోయాడు. తేరుకుని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శిరిష్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.