వైసీపీలో నియంతృత్వం పెరిగిపోయింది.. అందుకే పార్టీ నుంచి బయటకు వస్తున్నా: శత్రుచర్ల

19-02-2021 Fri 08:27
  • ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు
  • రాజకీయ దాడులు, బెదిరింపులు పెరిగాయి 
  • అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు
  • త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
Dictatorship has increased in the YCP says Satrucharla

రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని, అవి నచ్చకే పార్టీని శాశ్వతంగా వీడుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా చినమేరంగిలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకుంటే పింఛన్లు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు వర్తించవని వలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారని ఆరోపించారు.

ఇది సరైన విధానం కాదన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను తానెప్పుడూ చూడలేదన్నారు. రాజకీయ దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేశమాత్రమైనా లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం అథోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తనను ఎంతగానో వేధించాయని, అందుకనే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకైతే ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని నిర్ణయించుకోలేదని, కార్యకర్తలు, అనుచరులతో సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని శత్రుచర్ల తెలిపారు.