శ్రీలంకలోనూ పాగా వేస్తామన్న త్రిపుర సీఎం వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్సెస్ సీరియస్!

19-02-2021 Fri 07:35
  • బిప్లబ్ దేబ్ వ్యాఖ్యలపై వివరణ కోరిన బీజేపీ, సంఘ్
  • సీఎం వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న రాష్ట్రమంత్రి
  • బీజేపీ భావజాలాన్ని విస్తరిస్తామన్నదే ఆయన ఉద్దేశమని వివరణ
BJP and RSS brass meet Tripura CM Biplab Deb

నేపాల్, శ్రీలంకలోనూ పార్టీని విస్తరిస్తామన్న బీజేపీ నేత, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌దేవ్ వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం, ఆరెస్సెస్ తీవ్రంగా పరిగణించాయి. ముఖ్యమంత్రితో భేటీ అయిన బీజేపీ ఈశాన్య జోనల్ కార్యదర్శి అజయ్ జామ్‌వాల్, ఆరెస్సెస్ రీజనల్ ఇన్‌చార్జ్ ఉల్లాస్ కుల్‌కర్ణి, రాష్ట్ర ఇన్‌చార్జ్ నిఖిల్ నివాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరినట్టు తెలుస్తోంది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపైనా వీరు చర్చించినట్టు సమాచారం. దీంతో పాటు పార్టీకి సంబంధించి ఇతర విషయాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

బీజేపీ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి  అజయ్ జామ్‌వాల్, ఉల్లాస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ప్రాంత ప్రచారక్ నిఖిల్‌తో భేటీ అయినట్టు త్రిపుర సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, శ్రీలంక, అమెరికా దేశాల పౌరులు కూడా ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

తమ ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని చెప్పారని, బీజేపీ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చెప్పాలనుకున్నారని, అంతేకానీ, పార్టీని విస్తరిస్తామని కాదని వివరించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. కాగా, ఇటీవల బిప్లబ్‌దేబ్ మాట్లాడుతూ..నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ పార్టీని విస్తరించి, అధికారం చేపట్టడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమకు మార్గదర్శనం చేశారన్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.