అమరావతి నాలుగు స్తంభాల సెంటర్లో కేశినేని నానితో బుద్ధా వెంకన్న వర్గం వాగ్వాదం... వీడియో ఇదిగో!

18-02-2021 Thu 21:30
  • బెజవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు!
  • పార్టీ డివిజన్ కార్యాలయం ఓపెనింగ్ లో వాగ్వాదం
  • కేశినేని నానిని అడ్డుకున్న బుద్ధా వర్గీయులు
  • పార్టీ మారినవాళ్లను ఎలా ప్రోత్సహిస్తారన్న బుద్ధా వర్గం
Verbal Clash between Kesineni Nani and Buddha Venkanna aides

ఈ రోజు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గాల మధ్య ఘర్షణ జరగడం చర్చనీయాంశంగా మారింది. బెజవాడ టీడీపీలో విభేదాలు ఈ ఘటనతో బహిర్గతమయ్యాయి! అమరావతి నాలుగు స్తంభాల సెంటర్లో ఈ ఘటన జరిగింది.

ఇవాళ జరిగిన పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేశినేని నాని తన వర్గంతో విచ్చేశారు. అయితే, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గీయులు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేశినేని నాని వర్గంలోని ఓ వ్యక్తిని ఉద్దేశించి... పార్టీ మారినవాళ్లను టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని ఎంపీని బుద్ధా వర్గం గట్టిగా ప్రశ్నించింది. తాను చేసింది తప్పు అయితే చర్యలు తీసుకోవడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉందని నాని అదేస్థాయిలో బదులిచ్చారు.

నాడు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నప్పుడు చంద్రబాబు చేసింది తప్పు కాదా? అని నాని ప్రశ్నించారు. ఇలా నడిరోడ్డుపై గొడవలకు దిగితే టీడీపీకే నష్టం అని బుద్ధా వర్గీయులకు కేశినేని నాని స్పష్టం చేశారు. కాగా, కేశినేని నాని వర్గాన్ని అడ్డుకున్న వారిలో అత్యధికులు మహిళలే ఉన్నారు.