నాగార్జున బ్యానర్లో మెగా హీరో సినిమా!

18-02-2021 Thu 21:27
  • 'ఉప్పెన'తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
  • క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా
  • కొత్త దర్శకుడితో నాగార్జున ప్లానింగ్  
Vaishnav Tej to work in Nagarjuna banner

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన తాజా హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే పెద్ద హిట్టు కొట్టాడు. తను నటించిన 'ఉప్పెన' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని  సాధిస్తోంది. ఆర్టిస్టుగా వైష్ణవ్ కు ఇది ఎంతో పేరుతెస్తోంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో నటించే అవకాశం ఈ మెగా హీరోకి వచ్చింది. 'కొండపొలం' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. త్వరలో ఇది విడుదల కానుంది.

ఇక ఇప్పుడు 'ఉప్పెన' హిట్టయిన నేపథ్యంలో ఈ హీరోతో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా వైష్ణవ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనికి ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.