ఓడినా టీడీపీదే గెలుపు అని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది: రోజా

18-02-2021 Thu 20:55
  • ప్రజల తీర్పుతో చంద్రబాబుకు దిమ్మతిరిగింది
  • వైసీపీకి గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు
  • నిమ్మగడ్డలాంటి ఎస్ఈసీ దేశంలో ఎక్కడా ఉండరు
Despite all this Nimmagadda has not yet come to his senses says Roja

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికలలో గ్రామీణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు దిమ్మతిరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన సేవలను గుర్తించిన ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారని చెప్పారు.

కుప్పం నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలను చూస్తే... వచ్చే ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. పంచాయతీ ఎన్నికలలో ఓడినా టీడీపీదే గెలుపు అని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టారు. జనసేన బలవంతంగా నిలబెట్టిన అభ్యర్థులు కూడా వారికి వారు ఓటు వేసుకోకుండా వైసీపీకి ఓటు వేశారని చెప్పారు.

ఇంత జరిగినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు బుద్ధి రావడం లేదని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ స్వామి భక్తిని చాటుకునేందుకు ఆయన యత్నిస్తున్నారని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బెదిరింపులకు గురైన వారికి మళ్లీ నామినేషన్ అవకాశం ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇలాంటి ఎన్నికల కమిషనర్ దేశంలో మరెక్కడా ఉండరని విమర్శించారు.