అర్జున్ టెండూల్కర్ కు ఊరట... ఐపీఎల్ వేలంలో కనీస ధరకు కొనుక్కున్న ముంబయి ఇండియన్స్

18-02-2021 Thu 20:38
  • అర్జున్ టెండూల్కర్ ప్రారంభ ధర రూ.20 లక్షలు
  • ఆసక్తిచూపని ఇతర ఫ్రాంచైజీలు
  • చివరి నిమిషంలో దక్కించుకున్న ముంబయి
  • తాజా ఐపీఎల్ సీజన్ తో అరంగేట్రం చేయనున్న అర్జున్
Mumbai Indians bought Arjun Tendilker in IPL auction

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో అరంగేట్రం చేయనున్నాడు. ఇవాళ నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అర్జున్ ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా, ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో చివరికి అదే ధర వద్ద ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.

ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న ముంబయి జట్టులో స్థానం సంపాదించలేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంపికపైనా సందేహాలు వచ్చాయి. అయితే వేలంలో చివరి నిమిషంలో ముంబయి ఇండియన్స్ వర్గాలు అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేశాయి. సచిన్ తనయుడు అర్జున్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ మాత్రమే కాదు, బ్యాటింగ్ కూడా చేయగలడు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేలా సంచలన ప్రదర్శనలేవీ లేకపోవడం అర్జున్ కు లోటుగా మారింది.