Advocate Couple: అడ్వొకేట్ వామనరావు దంపతుల హత్య కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హెచ్చార్సీ

  • పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హత్యాకాండ
  • అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణి మృతి
  • ఇది సుమోటోగా స్వీకరించదగ్గ ఘటనేనన్న హెచ్చార్సీ
  • నివేదిక ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశాలు
 Telangana Human Rights Commission takes up Advocate couple murders as suo motto cognizance

సంచలనం సృష్టించిన అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల హత్య కేసును తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీఎస్ హెచ్చార్సీ) సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా ఈ హత్యలపై స్పందించినట్టు టీఎస్ హెచ్చార్సీ వెల్లడించింది.

ఈ దారుణ హత్యలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. శాంతిభద్రతల వ్యవస్థలు ఇలాంటి నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలతో సమాజంలో శాంతి లోపిస్తుందని పేర్కొంది. ఈ హత్యలు జరిగిన తీరు ఎంతో దురదృష్టకరమని అభిప్రాయపడింది.

ఈ హత్యాకాండలో మరణించినవాళ్లు తమ ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో ఫిర్యాదు చేశారని, కానీ వాళ్ల ప్రాణాలు కాపాడలేకపోయారని టీఎస్ హెచ్చార్సీ విమర్శించింది. ఏదేమైనా ఈ ఘటన సుమోటోగా స్వీకరించడానికి అర్హమైనదేనని భావిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళుతున్న వామనరావు, నాగమణి దంపతులను కత్తులతో నరికి చంపడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

More Telugu News