న్యాయ వ్యవస్థపై టీఆర్ఎస్ చేసిన అతి పెద్ద దాడి ఇది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

18-02-2021 Thu 19:39
  • వామనరావు దంపతుల హత్య అత్యంత దారుణం
  • ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలి
  • లాయర్లందరూ కలిసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి
This is biggest attack by TRS on judiciary says Uttam Kumar Reddy

న్యాయవాదులైన వామనరావు దంపతులను హత్య చేయడం అత్యంత దారుణమైన చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఘోరానికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై 24 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కొందరు పోలీసు అధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వామనరావు దంపతుల హత్య న్యాయ వ్యవస్థపై టీఆర్ఎస్ చేసిన అతిపెద్ద దాడి అని చెప్పారు.

సీఎం కేసీఆర్ మౌనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కు తెలంగాణలోని లాయర్లందరూ కలిసి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.