ముందు నా మేనల్లుడిపై పోటీ చేయండి.. ఆ తర్వాత నా గురించి ఆలోచించండి: అమిత్ షాకు మమతాబెనర్జీ సవాల్

18-02-2021 Thu 18:07
  • మమత వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న అమిత్ షా
  • మేనల్లుడిని సీఎం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ
  • రాత్రింబవళ్లు తమ గురించే మాట్లాడుతున్నారని దీదీ ఎద్దేవా
West Bengal CM Mamata Banerjee challenges Home Minister Amit Shah

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి మమతాబెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమిత్ షాను ఉద్దేశించి తాజాగా మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలుత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పోటీ చేయాలని... ఆ తర్వాత తన గురించి ఆలోచించాలంటూ అమిత్ షాకు ఆమె సవాల్ విసిరారు. రాత్రింబవళ్లు వారు తన గురించి, తన మేనల్లుడి గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  

మమత వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని... తన మేనల్లుడిని సీఎంను చేసేందుకు యత్నిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాపై దీదీ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల రికార్డులన్నింటినీ ఈసారి టీఎంసీ బద్దలు కొడుతుందని అన్నారు. అత్యధిక ఓట్లు, సీట్లను సాధిస్తామని చెప్పారు.