కార్మికులకు కేశినేని ట్రావెల్స్‌ రూ.1.47 కోట్లు బ‌కాయి పడింది: వెల్లంపల్లి

18-02-2021 Thu 17:29
  • విజయవాడలో మంత్రి వెల్లంపల్లి పర్యటన
  • పశ్చిమ నియోజకవర్గంలో స్థానికుల సమస్యలు తెలుసుకున్న వైనం
  • మీడియాతో మాట్లాడుతూ కేశినేని నానిపై వ్యాఖ్యలు
  • కేశినేని ట్రావెల్స్ కార్మికులకు జీతాలు చెల్లించాలని హితవు
Vellampalli tour in Vijayawada West Constituency

విజయవాడ కేంద్రంగా దక్షిణాదిన పెద్ద సంఖ్యలో బస్సు సర్వీసులు నడిపిన కేశినేని ట్రావెల్స్ కాలక్రమంలో సేవలు నిలిపివేసింది. ఈ సంస్థ ఎంపీ కేశినేని నానీకి సంబంధించినదన్న సంగతి తెలిసిందే. అయితే ట్రావెల్స్ సంస్థ యాజమాన్యం కార్మికులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించాల్సి ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.

కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు చెల్లించ‌కుండా నియోజ‌క‌వ‌ర్గం, రాష్ట్రం, దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్ధరిస్తాను అన‌డం కేశినేని నానికే చెల్లింద‌ని ఎద్దేవా చేశారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆయన ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 50వ డివిజను గొల్లపాలెం గట్టు వినాయకుని గుడి వద్ద నుంచి త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం సాయిబాబా గుడి వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ, కేశినేని ట్రావెల్స్‌కు చెందిన ఉద్యోగులు లెనిన్ సెంటర్లో ధర్నాచేసింది నిజం కాదా? అని ప్ర‌శ్నించారు.‌  

ట్రావెల్స్‌కు చెందిన కార్మికులు తమకు బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని, గుంటూరు లేబర్ కోర్టును ఆశ్రయించారన్న విషయాన్ని, లేబర్ కోర్ట్ లో పెండింగ్ కేసు గురించి తన అఫిడవిట్ లో ప్రస్తావించినట్టు ఆరోపించారు.

త‌న ఎన్నిక‌ల అఫిడవిట్ లో కార్మికులకు రూ.1,47,88,718 (ఒక కోటి 47 ల‌క్ష‌ల 88 వేల 718 రూపాయ‌లు) బ‌కాయి ఉన్న‌ట్లు పేర్కొన్న విష‌యంపై ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు. కేశినేని ఢిల్లీలో కూర్చుని నియోజకవర్గం కోసం ఏం చేశారనేది అంద‌రికీ తెలుసున్నారు. విజ‌య‌వాడ అభివృద్దికి కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌చ్చే ద‌మ్ము ఉందా? అని ప్ర‌శ్నించారు.