అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల కోసం చాదర్ ను సంప్రదాయబద్ధంగా సాగనంపిన సీఎం కేసీఆర్

18-02-2021 Thu 16:25
  • రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు
  • సీఎం కేసీఆర్ ముందు చాదర్ ఉంచిన ముస్లిం మతపెద్దలు
  • చాదర్ కు ప్రత్యేక ప్రార్థనలు
  • చాదర్ ను తలపై మోసిన సీఎం కేసీఆర్
CM KCR sends divine Chadar to Ajmer Durgah

రాజస్థాన్ లోని అజ్మీర్ ముస్లింలకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అక్కడి దర్గాలో నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు జాతీయస్థాయిలో ప్రాధాన్యత ఉంది. దేశం నలుమూలల నుంచి మతాలకు అతీతంగా అజ్మీర్ దర్గాకు వెళుతుంటారు.

కాగా, అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించేందుకు రూపొందించిన చాదర్ ను ముస్లిం మతపెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు ఉంచారు. ముస్లిం మతపెద్దల ప్రార్థనల అనంతరం చాదర్ ను సీఎం కేసీఆర్ తలపై మోశారు. ఆపై అజ్మీర్ దర్గాకు సంప్రదాయబద్ధంగా సాగనంపారు. ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మతపెద్దలు ప్రార్థనల సందర్భంగా... తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని ప్రార్థించారు.

ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీ, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్,  ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్ తదితరులు కూడా పాల్గొన్నారు.