చంద్రబాబు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి: రోజా

18-02-2021 Thu 15:40
  • జగన్ ఏం పీకాడని చంద్రబాబు  అన్నారు
  • కుప్పం ప్రజలు చంద్రబాబును పీకేశారు
  • కేవలం 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు
Atleast now Chandrababu has to keep his mouth shut says Roja

ఏం పీకాడంటూ ముఖ్యమంత్రి జగన్ పై నోరు పారేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబును తిరస్కరించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం ఎదురైందని చెప్పారు.

కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా... వాటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయని... వాటిలో 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. కేవలం 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు.

1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని రోజా గుర్తుచేశారు. మూడు దశాబ్దాలకు పైగా టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న చోట... ఇప్పుడు వైసీపీ జెండా ఎగిరిందని చెప్పారు. మనవడితో ఆడుకోవడానికి చంద్రబాబును కుప్పం ప్రజలు ఇంటికి పంపించేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఏం పీకాడని అన్న చంద్రబాబు ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని అన్నారు.