వామనరావు దంపతుల హత్య కేసులో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు

18-02-2021 Thu 15:10
  • తెలంగాణలో అడ్వొకేట్ దంపతుల దారుణ హత్య
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వామనరావు తండ్రి
  • వసంతరావు, కుంట శ్రీను, కుమార్ లపై కేసు నమోదు
  • గతంలో హైకోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలు చేసిన వామనరావు
Police registeres FIR on three persons in advocate couple murder case

పెద్దపల్లి జిల్లా కవలచర్ల వద్ద హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీను, ఏ3గా కుమార్ లపై కుట్ర, హత్య అభియోగాలు మోపారు. వారిపై ఐపీసీ 120బి, 302, 341, 34 కింద కేసు నమోదు చేశారు.

కాగా, వామనరావు తనపై దాడి జరిగిన చాలాసేపటివరకు రోడ్డుపై కొనప్రాణంతో కొట్టుమిట్టాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ, కుంట శ్రీను పేరు చెప్పినట్టు తెలుస్తోంది. కుంట శ్రీను కూడా వామనరావు స్వగ్రామం గుంజపడుగుకు చెందినవాడే కావడం గమనార్హం. ఓ స్థలం విషయంలో వామనరావు హైకోర్టులో పిల్ వేయగా, తనకు అడ్డురావొద్దంటూ కుంట శ్రీను హెచ్చరించినట్టు సమాచారం. హత్యకు ఈ స్థల వివాదమే కారణం కావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

అటు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు వందల కోట్ల విలువైన భూ వివాదం, పుట్ట మధు భార్య శైలజ మంథని మున్సిపల్ చైర్మన్ పదవి అనర్హత అంశాలపై వామనరావు దంపతులే న్యాయస్థానంలో వాదిస్తున్నారు. అయితే, వామనరావు తన చివరిక్షణాల్లో కుంట శ్రీను పేరు చెప్పడంతో అతడ్ని అరెస్ట్ చేస్తే దర్యాప్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కుంట శ్రీను మంథని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు.

పోలీసులతోనూ వామనరావుకు వివాదాలు ఉన్నాయి. కొంతకాలం కిందట మంథని పీఎస్ లో శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్ లో మృతి చెందాడు. ఈ ఘటనకు సీఐ, ఎస్ఐలే కారణమంటూ వామనరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును వామనరావు భార్య నాగమణి వాదిస్తున్నారు. అయితే పోలీసులు తనపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ వామనరావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను పీఎస్ కు పిలిపించవద్దని, నోటీసులు లేకుండా అరెస్ట్ చేయొద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.