లీకులు ఆపండి.. ఆ మూడు చానెళ్లపై చర్యలు తీసుకోండి: ఢిల్లీ హైకోర్టులో దిశా రవి

18-02-2021 Thu 14:55
  • దర్యాప్తు సమాచారాన్ని పోలీసులు మీడియాకు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి
  • తన వాట్సాప్ చాట్ లను  లీక్ చేయకుండా చూడాలని వినతి
  • మీడియా సంస్థలు కేబుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ పట్టించుకోలేదని వెల్లడి
  • చాట్ ల ప్రసారం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని ఆరోపణ
Stop Media LeaksDisha Ravi Plea To Delhi High Court

టూల్ కిట్ ఎడిటింగ్ కేసులో పర్యావరణ కార్యకర్త దిశా రవి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు లీక్ చేయకుండా చూడాలని కోరారు. తన ప్రైవేట్ చాట్ లు మీడియా ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఆమె ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

అనుమతి లేకుండానే థర్డ్ పార్టీతో చేసిన ప్రైవేట్ చాటింగ్ వివరాలను ప్రసారం చేసినందుకు మూడు జాతీయ వార్తా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ఆ సంస్థలు కేబుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ ను ఉల్లంఘించాయని ఆమె పేర్కొన్నారు. సమాచార ప్రసార శాఖ ఆయా చానెళ్లపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.

ఏ చానెల్ కూడా తన వాట్సాప్ ప్రైవేట్ చాట్ వివరాలను వెల్లడించకుండా చూడాలన్నారు. దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం అక్రమమని వ్యాజ్యంలో దిశ ఆరోపించారు. అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం, పరువుకు భంగం కలిగించడమేనని ఆమె అన్నారు. ఢిల్లీ పోలీసుల చర్య రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించినట్టేనన్నారు.