బీజేపీలో చేరుతున్న 'మెట్రోమేన్' శ్రీధరన్

18-02-2021 Thu 13:47
  • ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు పలు ప్రాజెక్టుల వెనుక శ్రీధరన్
  • పద్మశ్రీ, ప్రద్మభూషణ్ లతో గౌరవించిన భారత ప్రభుత్వం
  • బీజేపీ కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న శ్రీధరన్
Metro Man E Sreedharan To Join BJP

ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు దేశంలోని పలు ప్రాజెక్టుల వెనుక ఉన్న ఇంజినీరింగ్ లెజెండ్, మెట్రోమేన్ ఇ.శ్రీధరన్ (88) బీజేపీలో చేరబోతున్నారు. మేలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆదివారం నుంచి కేరళలో విజయయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా 88 ఏళ్ల శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

'నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. కొన్ని అధికారికమైన ఫార్మాలిటీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి' అని ఈ సందర్భంగా శ్రీధరన్ చెప్పారు. దేశానికి బీజేపీ చేస్తున్న సేవలు చాలా గొప్పవని... బీజేపీని ఇతర జాతీయ పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తుండటం సరికాదని... విపక్షాల ధోరణిని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

పార్టీ కోరితే ఎన్నిల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు. తన సమయాన్ని, అనుభవాన్ని ఇకపై మరో విధంగా (రాజకీయాల ద్వారా ప్రజా సేవ) వినియోగించాలనుకుంటున్నానని అన్నారు. 2011లో ఢిల్లీ మెట్రో చీఫ్ గా శ్రీధరన్ రిటైర్ అయ్యారు. శ్రీధరన్ ను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీతో, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.