నైజీరియాలో దారుణం: బడి పిల్లలను కిడ్నాప్​ చేసిన సాయుధ బందిపోట్లు

18-02-2021 Thu 13:27
  • సైనిక దుస్తుల్లో పాఠశాలలోకి చొరబడిన ముఠా
  • ఒక విద్యార్థిని కాల్చి చంపిన వైనం
  • కొందరు విద్యార్థులు, టీచర్లు, బంధువుల అపహరణ
  • సహాయ చర్యలకు ఆర్మీని పంపిన దేశాధ్యక్షుడు
  • ఐరాస, యునిసెఫ్ స్పందన
Gunmen kidnap dozens from school in central Nigeria

నైజీరియాలో దారుణం జరిగింది. సైనిక దుస్తుల్లో పాఠశాలలోకి ప్రవేశించిన సాయుధ బందిపోట్ల ముఠా ఓ విద్యార్థిని కాల్చి చంపింది. మరికొందరు విద్యార్థులను, వారి బంధువులు, టీచర్లను కిడ్నాప్ చేసింది. ఈ ఘటన నైజీరియాలో ఆ దేశ కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఘటనపై దేశాధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దింపారు.

అధికారులు, ఆర్మీ వర్గాల కథనం ప్రకారం.. కగారాలోని ప్రభుత్వ సైన్స్ కాలేజీపై దుండగులు దాడి చేశారు. మొత్తం 42 మందిని చెరబట్టారు. అందులో 27 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు, స్కూల్ లోనే పనిచేసే విద్యార్థుల బంధువులు 12 మంది దాకా ఉన్నారు.

పాఠశాలలో మొత్తం 650 మంది దాకా విద్యార్థులున్నారని, తెల్లవారుజామున స్థానిక బందిపోట్ల ముఠా స్కూల్ లోకి చొరబడిందని నైజర్ ప్రభుత్వ ప్రతినిధి మహ్మద్ సానీ ఇద్రిస్ చెప్పారు. కిడ్నాప్ ఘటనను బుహారీ ఖండించారు. వెంటనే చెరలో ఉన్న పిల్లలను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని కోరారు.

ఇటీవలి కాలంలో నైజీరియాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. రెండు నెలల క్రితమే ఓ స్కూల్ నుంచి 300 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు బుహారీ సొంత రాష్ట్రంలోని కంకారాలోనే ఈ ఘటన జరిగింది. తర్వాత ప్రభుత్వాధికారుల చర్చలతో బందిపోట్లు దిగివచ్చి వారిని విడుదల చేశారు.

దీనిపై ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి, పిల్లల సంరక్షణ సంస్థ యునిసెఫ్ లు స్పందించాయి. వెంటనే పిల్లలను విడిచిపెట్టాలని కోరాయి. బడులు, పిల్లలపై దాడులు చాలా హేయమైన చర్య అని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ అన్నారు. ఘటనలను ఖండించాల్సిన అవసరముందన్నారు.

ఇల్లు, బడిలో ఎల్లవేళలా పిల్లలు భద్రం అన్న భావనను కల్పించాల్సిన అవసరం ఉందని, బడికి పంపించిన పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ఉండే రోజులు రావాలని యునిసెఫ్ నైజీరియా ప్రతినిధి పీటర్ హాకిన్స్ అన్నారు. పాఠశాలలపై దాడి చేసి పిల్లలను అపహరించడం యుద్ధ నేరమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.