ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు ఇనుమడింపజేశారు: ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌

18-02-2021 Thu 13:19
  • మూడో విడత ఎన్నికల్లో పలు సమస్యాత్మక గ్రామాలున్నాయి
  • అయిన‌ప్ప‌టికీ పెద్ద ఎత్తున వ‌చ్చి ఓట్లు వేశారు
  • ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబ‌ద్ధ‌త చూపారు
  • టీచర్ దైవ‌ కృపావతి మృతి ప‌ట్ల విచారం
nimmagadda praises police and voters

ఆంధ్రప్రదేశ్ లో చె‌దురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా ప్ర‌శాంతంగా ముగిశాయి. దీనిపై ఏపీ ఎన్నికల ప్ర‌ధాన అధికారి‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మూడో విడత ఎన్నికల్లో పలు సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ అంద‌రూ సహకరించారని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు ఇనుమడింపజేశారని తెలిపారు.

అంతేగాక‌, ఏజెన్సీలో దాదాపు 350 పోలింగ్‌ కేంద్రాల్లో బహిష్కరణ పిలుపును కూడా గిరిజ‌న‌ ఓట‌ర్లు లెక్క‌చేయ‌కుండా పోలింగ్‌లో పాల్గొన్నార‌ని చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా కొన‌సాగ‌డానికి ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబ‌ద్ధ‌తతో పనిచేశారని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో టీచర్ దైవ‌ కృపావతి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల ఆయ‌న సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. విజయనగరం జిల్లా చౌడవరంలో జరిగిన హింసాత్మక ఘటనను కానిస్టేబుల్ కిశోర్‌ కుమార్ సమర్థంగా నియంత్రించారని ప్రశంసించారు. నాలుగో విడతలోనూ ఓట‌ర్లు ఇదే రీతిలో ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.