వామనరావు దంపతుల హత్యతో టీఆర్ఎస్ కు సంబంధం లేదు: జక్కు శ్రీవర్షిణి

18-02-2021 Thu 12:41
  • హత్యలు చేస్తూఉంటే ఇన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి కాదు
  • శ్రీధర్ బాబు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు
  • కుంట శీను గతంలో కాంగ్రెస్ ఎంపీటీసీగా ఉన్నాడు
TRS has no link with Vaman Raos murders says Jakku Srivarshini

హైకోర్టు లాయర్లుగా పని చేస్తున్న వామనరావు దంపతుల హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన హత్యేనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హత్యల వెనుక పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ పుట్ట మధు హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీవర్షిణి మంథనిలోని పుట్ట మధు నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, వామనరావు దంపతుల హత్యలతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేసుకుంటూ పోయిఉంటే ఇన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి కావని అన్నారు. కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శీను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పని చేశాడని చెప్పారు.

మరోవైపు న్యాయం తరపున పోరాటం చేస్తున్న లాయర్లకు రక్షణ కల్పించాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లాయర్లకు రక్షణ కల్పించే అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే అమల్లోకి తేవాలని కోరింది. వామనరావు దంపతులు నిరంతరం న్యాయం కోసం పరితపించేవారని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు. వారి హత్యను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని  కోరారు.