పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌మిళిసై

18-02-2021 Thu 12:08
  • పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు
  • ప్ర‌మాణ స్వీకారం చేయించిన‌ మద్రాస్‌ హైకోర్టు సీజే 
  • హాజ‌రైన‌ ముఖ్యమంత్రి నారాయణస్వామి
tamilisai takes oath as LieutenantGovernor of Puducherry

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన విష‌యం తెలిసిందే. నిన్న‌ పుదుచ్చేరి స్పెషల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కృష్ణకుమార్‌ సింగ్.. ‌తమిళిసైకి నియామక పత్రాలను అందజేయ‌డంతో ఈ రోజు పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో ఆమెతో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.  

ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మాతృభాష త‌మిళంలో తాను ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం గ‌ర్వంగా, సంతోషంగా ఉంద‌ని త‌మిళిసై ట్వీట్ చేశారు. కాగా, నిన్న రాత్రే త‌మిళిసై పుదుచ్చేరి చేరుకున్నారు. ఆమెకు నారాయణస్వామి స్వాగతం పలికారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 16న త‌ప్పించిన‌ విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా ఎన్డీఏ స‌ర్కారు ఈ మార్పును చేసినట్టు తెలుస్తోంది.